Showing posts with label General News. Show all posts
Showing posts with label General News. Show all posts

Tuesday, 30 December 2014

ధోనీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై

మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అనంతరం ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ధోని 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో 60 టెస్ట్‌లకు నాయకత్వం వహించాడు.

అతని రిటైర్మెంట్ పై స్పందిస్తూ, ధోనీ అత్యుత్తమ భారత టెస్ట్ కెప్టెన్‌లలో ఒకరని, అతని నాయకత్వంలో భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్ర స్థానానికి ఎదిగిందని బీసీసీఐ ప్రశంసించింది. దీనితో వన్డే, టీ-20లలో మాత్రమే ధోనీ కొనసాగుతాడు.

మెల్‌బోర్న్ టెస్ట్‌లో ధోనీ పేరిట కొత్త రికార్డు నమోదైంది. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది మందిని అవుట్ చేయడంలో(8 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) పాలు పంచుకున్న మొదటి భారత వికెట్ కీపర్ అయ్యాడు. ఆస్ట్రేలియా మీద ఈ ఫీట్ సాధించిన వారిలో ధోనీ మూడవ ఆటగాడు.

Saturday, 20 September 2014

మంచి సినిమాలే తీస్తా దర్శకురాలు ఫరాఖాన్

ఫరాఖాన్ తన అనుభవాలను మీడియాతో పంచుకుంటూ తాను పనికిమాలిన సినిమాలను తీయనని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రాలనే తెరపెకైక్కిస్తానని అంది. ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందనే విషయాన్ని అంత తేలిగ్గా ఎవరూ అంచనా వేయలేరంది. ముఖ్యంగా బీక్లాస్ ఆడియన్స్‌తోపాటు లండన్, అమెరికా దేశాలకు చెందిన ప్రేక్షకులను ను మెప్పించడం అంత సులువేమీ కాదంది.

కొంతమంది పెద్ద పెద్ద నటులతో కలిసి మంచి కళాతమకమైన సినిమాలే తీస్తానని, పనికిమాలిన సినిమాలు అసలు తీయనని‘తీస్ మార్ ఖాన్’ దర్శకురాలైన ఈ 49 ఏళ్ల ఈ కొరియోగ్రాఫర్ తెలిపింది. షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా ఇటీవల ‘హేపీ న్యూ ఇయర్’ సినిమా తీసింది. ఇందులో షారుఖ్‌ఖాన్ కథానాయకుడు కాగా ఇంకా దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, సోనూసూద్,  వివన్‌షా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుని చరిత్ర సృష్టించారు!

ఢిల్లీకి చెందిన అచిన్ నరులా, సార్థక్ నరులా ఈ అన్నదమ్ములిద్దరూ నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వీరిద్దరూ సెలబ్రిటీలైపోయారు.  కారణం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ టీవీ షో. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీ 8వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతుండడంతెలిసిందే. ఈ కార్యక్రమంలో తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుని నరూలా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. నాలుగు లైఫ్ లైన్ల సాయంలో 14 ప్రశ్నలనూ కరెక్ట్‌గా చెప్పి రికార్డు స్థాయి ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్, ట్విట్టర్‌లో వెల్లడించారు. విజేతలకు చెక్కును ఇస్తున్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు. కేబీసీ ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నది వీరిద్దరే కావడం గమనార్హం.

అచిన్ ఢిల్లీలో మార్కెటింగ్ మేనేజర్. సార్థక్ ఓ విద్యార్థి. అచిన్ పదేళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించి ఇప్పటికి సఫలమయ్యాడు. ‘‘ఈ రాత్రి ప్రపంచం తల్లకిందులైంది. ఇందుకు కేబీసీనే కారణం. అద్భుతమైన క్షణాలివి. ఏం మేథస్సు. ఎంత అద్భుతంగా ఆడారు. ఇది కేబీసీ వల్లే సాధ్యమైంది. నమ్మశక్యం కాని క్షణాలివీ’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు బిగ్‌బీ.
 

Tuesday, 16 September 2014

4జీ వైఫై... వస్తోందోయ్!

ఎప్పుడూ నాలుగు గోడల మధ్య కూర్చొని పని చేయడం కంటే అప్పుడప్పుడూ ఆరుబయట కూర్చొని ప్రకృతి అందాలను తిలకిస్తూ... పక్షుల కిలకిలారావాలు వింటూ విధులు నిర్వహిస్తే ఎంత బాగుంటుందో కదూ... ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటుంటారు. త్వరలో వారి కల నెరవేరబోతోంది. మాదాపూర్‌లో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.

మాదాపూర్: మాదాపూర్‌లో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కారిడార్‌లో వైఫై సేవలందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలూ వైఫై సేవలు వినియోగించుకునేందుకు వీలుంటుంది. మాదాపూర్ శిల్పారామంలో వైఫై పనులు చురుగ్గా సాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 4జీ వైఫై అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు దాదాపు పూర్తి చేసింది. శిల్పారామంలో ప్రతి 250 మీటర్ల దూరానికి ఆరేసి వైఫై పాయింట్లను ఏర్పాటు చేశారు.

ప్రధాన ద్వారం లాన్ వద్ద, ఆంపీ థియేటర్, నైట్‌బజార్, రూరల్ మ్యూజియం, కోనసీమ, రద్దీగా ఉండే ప్రాంతాలలో పాయింట్లు ఏర్పాటు చేశారు. త్వరలో 4జీ సేవలను సందర్శకులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంపీ థియేటర్ వద్ద గ్రౌండ్ బాస్ మాస్ట్ (జీబీఎం)ను ఏర్పాటు చేశారు. ఈ జీబీఎం 500 మీటర్ల రేడియేషన్‌ను కవర్ చేస్తుంది. దాదాపుగా శిల్పారామంలోని అన్ని ప్రాంతాలకు వైఫై అందుబాటులో ఉంటుంది.

హైటెక్ సిటీలో...

సైబర్ పెరల్, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ వద్ద కూడా వైఫై పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో మాదాపూర్‌లోని ఐటీ కారిడార్‌లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చే వీలుంది.

Monday, 15 September 2014

రూ.10కే సింగపూర్ విమాన టికెట్...

విమానయాన సంస్థల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశీయ మార్గాల్లోనే ధరలను తగ్గించిన సంస్థలు.. తాజాగా అంతర్జాతీయ రూట్లకు సైతం ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఖతార్ ఎయిర్‌వేస్, టైగర్‌ఎయిర్‌వేస్ ఇందుకు తెరలేపాయి. టైగర్‌ఎయిర్‌వేస్‌ను ప్రారంభించి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా భారత్ నుంచి సింగపూర్ టికెట్ ధరను రూ.10గా నిర్ణయించింది. కేవలం ఒక రూట్ మాత్రమే ఈటికెట్ వర్తించనున్నది. మళ్లీ వచ్చే టప్పుడు కంపెనీ సేవలను ఎంచుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. తిరుగు ప్రయాణ టికెట్ ధరను మాత్రం అన్ని పన్నులు కలుపుకొని రూ.7,499గా నిర్ణయించింది. ఈ నెల 21 వరకు ఆఫర్ అందుబాటులో ఉండనున్నది. బుకింగ్ చేసుకున్నవారు వచ్చే ఏడాది జనవరి 12 నుంచి మార్చి 31, జూలై 21 నుంచి సెప్టెంబర్ 22 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ పేర్కొంది. అలాగే ఖతార్ ఎయిర్‌వేస్ కూడా అంతర్జాతీయ టికెట్లపై 25 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 పట్టణాల మధ్య నడుస్తున్న విమానాల్లో ఈ డిస్కౌంట్ ఆఫర్ లభించనున్నది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్ బుధవారం వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. బుకింగ్ చేసుకున్న వారు ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది జూన్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ భారత్ నుంచి వయా దోహా మీదుగా వెళ్లే విమానాలకు మాత్రమే వర్తించనున్నది.

Sunday, 14 September 2014

మణిపూర్ లో తెలుగు విద్యార్ధులపై దాడులు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ చదువుతున్న తెలుగు విద్యార్థులపై గురువారం నుంచి వరుస దాడులు జరుగుతున్నాయి. హాస్టల్ మెస్‌లో జరిగిన చిన్న ఉదంతం చినికిచినికి గాలి వానగా మారి విద్యార్థుల మధ్య ఘర్షణలకు దారితీసింది. స్థానిక విద్యార్థులు, తెలుగు విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు సృష్టించింది. గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు అక్కడి నిట్‌లో క్షణ క్షణం భయంభయంగా గడుపుతున్నారు. 
 
 చికెన్ తెచ్చిన వివాదం...!
 మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఐదేళ్ల క్రితం నిట్‌ను ప్రారంభించారు. అక్కడి టక్యాల్‌పట్, లాంగోల్‌లో ఉన్న రెండు క్యాంపస్‌ల్లో పలువురు తెలుగు విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన విద్యార్థులు బీటెక్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కొత్తగా నిర్మించిన లాంగోల్ క్యాంపస్‌లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లకు చెందిన వారిని తరలించారు. గురువారం రాత్రి హాస్టల్ మెస్‌లో స్థానిక సీనియర్ విద్యార్థులు, జూనియర్లైన తెలుగు విద్యార్థుల మధ్య జరిగిన ఓ ఘటన ఘర్షణకు దారి తీసింది. ఓ సీనియర్ విద్యార్థి క్యూలో నిలుచున్న జూనియర్లను కాదని నేరుగా చికెన్ వడ్డిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీన్ని ఓ జూనియర్ తెలుగు విద్యార్థి అడ్డుకోవడంతో వివాదం రేగింది. దీన్ని మనసులో పెట్టుకున్న సీనియర్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తెలుగు విద్యార్థులను రోడ్డుపై అడ్డుకుని స్థానికులతో కలిసి చితకబాదారు. అయితే తరువాత కొందరు తెలుగు విద్యార్థులు సీనియర్ల వద్దకు వెళ్లి కలసిమెలసి ఉందామని కోరినా వినకుండా మరోసారి దాడికి దిగి సెల్‌ఫోన్లను లాక్కున్నారు. 
 
 కేంద్ర హోంశాఖకు బీహార్ ఫిర్యాదు
 బాధితుల్లో కొందరు బీహార్ విద్యార్థులు ఉండటంతో విషయం అక్కడి మీడియాకు చేరింది. శనివారం బీహార్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో అక్కడి ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీసింగ్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు శనివారం నిట్ క్యాంపస్‌ను సందర్శించారు. తెలుగు విద్యార్థులను కలిసి వారి భద్రతకు భరోసా ఇచ్చారు. కొందరి సెల్‌ఫోన్లను తిరిగి ఇప్పించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నిట్ క్యాంపస్‌కు సీఆర్‌పీఎఫ్ బలగాలను తరలించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్వయంగా సీఎం వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుగు విద్యార్థులు వాపోతున్నారు. శనివారం అర్థరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు స్థానికులతోపాటు అక్కడి విద్యార్థులు క్యాంపస్‌లోకి చొరబడి బీభత్సం సృష్టించారని చెబుతున్నారు. తలుపులు, కిటికీలపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగటంతో తెల్లవారే వరకు బాత్రూమ్‌ల్లో భయంభయంగా గడిపామని తెలిపారు. తక్షణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. యాజమాన్యంతో పాటు పోలీసులు సైతం స్థానిక విద్యార్థులకు వత్తాసు పలికారని ఆరోపిస్తున్నారు.

Wednesday, 10 September 2014

పాపికొండల మధ్య రోప్ వే

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సిరివాక గ్రామంలో పాపికొండలను కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కాగా పాపికొండల మధ్య అందంగా గోదావరి నది పాయ ప్రవహిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా చూపరులను ఆకర్షిస్తుంది. ఈ నేపధ్యంగా రెండు కొండల మధ్య 300మీటర్ల మేరకు సిరివాక గ్రామంలో రోప్ వే ఏర్పాటును చెయ్యాలని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా రోప్ వే నిర్మాణంలో 1.5 నుండి 2కిలోమీటర్ల దూరంలో పోల్స్ ను ఏర్పాటు చెయ్యాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే రెండు రోప్ వేలను సమాంతరంగా ఏర్పాటు చెయ్యాల్సిందిగా వీరు పేర్కొంటున్నారు. ఇక పాపికొండ నేషనల్ పార్క్ పైన ఈ రోప్ వేలు ఏర్పాటు చెయ్యబోతుండడంతో పర్యాటకులు అటు గోదావరి అందాలను, ఇటు జంతు, జీవరాసులను చూసి ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరితంగా పూర్తికావాలని ఎందరో పర్యాటక ప్రియులు ఎదురుచూస్తున్నారు.

పొగబాబులూ…జర జాగ్రత్త!

భారత దేశాన్ని పొగాకు రహిత దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపధ్యంగా బహిరంగంగా సిగరెట్లు తాగేవారికి వేసే జరిమానాను ఇకపై పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది. దీనిని అనుసరించి ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసే వారికి వేసే 200రూపాయల జరిమానాను 20వేల రూపాయలకు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పొగాకు నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి రమేష్ చంద్ర నేతృత్వంలో నియమించిన నిపుణుల బృందం తాజాగా ఆరోగ్య శాఖకు తన నివేదికను అందచేసింది. కాగా ఈ నిపుణుల కమిటీ పొగతాగే వారిపై జరిమానాతో పాటుగా వయో పరిమితి కూడా విధించాలని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే సిగరెట్ల విడి అమ్మకాలను కూడా నిషేధించాలని ఈ కమిటీ పేర్కొంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తెలియనుంది.

Monday, 8 September 2014

త్వరలో ‘సచిన్‌ టెండూల్కర్‌’ కప్‌..?

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరుతో ఓ సిరీస్‌ నిర్వహించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 26న జరిగే బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో టెండూల్కర్‌ సిరీస్‌కు ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. ‘సచిన్‌ పేరిట సిరీస్‌ నిర్వహించడం ఎంతో గర్వకారణం. ఏదో ఆషామాషీ సిరీస్‌లా కాకుండా.. అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించాలని బోర్డు యోచిస్తోంద’ని బీసీసీఐ కార్యదర్శి సంజయ్‌ పటేల్‌ తెలిపాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌కు సచిన్‌ పేరు పెడతారా అని అడగగా...దానికి పటేల్‌ సమాధానమివ్వలేదు.

దైవకణంతో విశ్వ నాశనం

లండన్‌: విశ్వం ఎలా అంతమవుతుంది? వరదలు, ప్రళయాలు వగైరా వగైరా వంటి వాటితో విశ్వం తుడిచిపెట్టుకుపోతుందా? అంటే సరైన సమాధానం రాకపోవచ్చు. కానీ, దైవకణంగా మనం పిలుస్తున్న హిగ్స్‌-బోసన్‌కు మాత్రం విశ్వాన్ని నాశనం చేసే శక్తి ఉందట! ఇది 72 ఏళ్ల ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఇటీవల చెప్పిన కఠోర నిజం! అధిక శక్తి వద్ద దైవకణం అస్థిరంగా ఉంటుందని ఆయన అంటున్నారు. దాని వల్ల ‘విధ్వంసక శూన్యం’ (కేటాస్ర్టోఫిక్‌ వాక్యూమ్‌ డెకే) ఏర్పడి విశ్వం మొత్తం అంతమవుతుందని ఆయన హెచ్చరించారు. ఆ శూన్యం కాంతివేగంతో విశ్వం మొత్తం ఆవరిస్తుందట! స్థలకాలాదులన్నీ ఏకమైపోయి విశ్వంలో ఏమీ మిగలదని అంటున్నారు.
అది ఎలా వస్తుందో, ఎప్పుడో వస్తుందో కూడా ఎవరికీ అంతుపట్టదని హెచ్చరించారు. చందమామపై తొలిసారి అడుగిడిన నీల్‌ ఆర్మ్‌సా్ట్రంగ్‌, బజ్‌ అల్ర్డిన్‌ తదితర వ్యోమగాములు, శాస్త్రవేత్తల వ్యాసాలతో కూడిన ‘స్టార్మస్‌’ అనే పుస్తకం ముందుమాటలో ఆయన ఈ వివరాలను తెలిపారు. 100బిలియన్‌ గిగా ఎలకా్ట్రన్‌ వోల్టులు మించినశక్తి వద్ద దైవకణం స్థిరత్వాన్ని కోల్పోతుందని.. ఆ వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. అయితే, సమీప భవిష్యత్తులో అంతటి శక్తిమంతమైన పరిశోధనలు చేయగల సామ ర్థ్యం ఉన్న ప్రయోగశాలు లేనందున.. ఇప్పట్లో దాని వల్ల ప్రమాదం ఏదీ లేదని మాత్రం చెప్పారు. దైవకణాన్ని 2012లో సెర్స్‌ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం మనకు తెలిసిందే.

ఆ లడ్డూ బాలాపూర్ దే !

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది.  ఈ సారి లడ్డూ గత ఏడాదికంటే 24 వేల రూపాయలు అధికంగా పలికింది. గత ఏడాది, అంతకుముందు ఏడాది లడ్డూను స్థానికేతరులు వేలంపాటలో చేజిక్కించుకున్నారు. ఈ సారి మాత్రం బాలాపూర్ కే చెందిన సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రూ.9.50 లక్షలకు పాడి చేజిక్కించుకున్నాడు. గత ఏడాది ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలకు ఈ లడ్డూను గెలుచుకున్నారు.
లడ్డూను వేలం పాటలో గెలుచుకున్న జయేందర్ రెడ్డి దానిని నెత్తిన పెట్టుకుని గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. లడ్డూను గెలుచుకున్నందుకు ఆయనకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

మహా గణపతికి నేడూ పూలవర్షం

ఖైరతాబాద్ మహాగణపతిపై మంగళవారమూ పూలవర్షం కురవనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ మేరకు ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఛాపర్ ద్వారా ఐదుసార్లు తిరిగి, దాదాపు మూడు క్వింటాళ్ల గులాబీ పూలను విగ్రహంపై కురిపించేందుకు ప్రయత్నించారు. వాతావరణం, గాలి వీచే దిశ తదితర కారణాల వల్ల అవి అనుకున్న స్థాయిలో విగ్రహంపై పడలేదు. దీంతో మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్యలో నిమజ్జనానికి ముందు సాగర్ తీరంలో మరోసారి పూలవర్షం కురిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ మైకులో ప్రకటించింది.

11,116 కొబ్బరి కాయల మొక్కు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే 11,116 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నగర కన్వీనర్ చంద్రశేఖర్ (చందు) తన మొక్కు తీర్చుకున్నారు. వినాయక చవితి రోజు మొదటి కొబ్బరికాయను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా కొట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం చందు పది రోజుల పాటు రోజూ వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. చివరి రోజు సోమవారం కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి 1,116 కొబ్బరి కాయలను కొట్టి గణనాథుడి మొక్కు తీర్చుకున్నారు.

Thursday, 4 September 2014

గూగుల్ సెర్చ్ లో టాప్ ఏంటో తెలుసా ?

ప్రపంచంలోని యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలలో చోటు దక్కించుకున్న కట్టడాలలో ఎక్కువమంది శోధిస్తున్నది దేని గురించో తెలుసా ? ఇంక దేని గురించి మన హైదరాబాద్ షాన్ ..చార్ సౌ సాల్ కా నిషాన్ మన చార్మినార్ గురించేనట. ప్రపంచంలోని ప్రముఖ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న చార్మినార్ గురించి ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ లో వెతుకుతున్నారట. హైదరాబాద్ కు రావాలనుకుంటున్న పర్యాటకులు ఇక్కడ దేనిని సందర్శించాలి భావిస్తూ తమ మొదటి ఓటు చార్మినార్ కే వేస్తున్నారట.
2013 నుండి గూగుల్ ద్వారా పరిశీలించిన డాటాను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు. చార్మినార్ తరువాత స్థానాలలో సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ప్యాలేస్, పురానీ హవేలీలు ఉన్నాయి. ఇక వీటి తరువాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న ఇతర కట్టడాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్ సంస్కృతికి వారసత్వంగా నిలిచిన చార్మినార్ ప్రథమస్థానంలో నిలవడం తెలంగాణకు గర్వకారణం.

Wednesday, 3 September 2014

"అద్భుతం అ గుండె మార్పిడి " ఒక నగరం నుండి మరొక నగర ప్రయాణం

అద్భుతం చేసారు అంత కలిసి ఎందుకంటే గుండెను ఒక వ్యక్తి నుండి ఇంకోక వ్యక్తికి మార్చడమే అద్భుతం అయితే ఒక నగరం నుండి మరొక నగరానికి చాల భద్రంగా చేర్చి మరొక వ్యక్తికి అమర్చి "మహాఅద్భుతం" అనిపించారు.
ఇంతకు ముందు హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్ కి గుండెను ట్రాఫిక్ లో వేగంగా తరలించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు అలాంటి ఘటన మరవక ముందే ఇంకో ఘటన జరిగింది.  కానీ ఈసారి బెంగళూర్ చెన్నై మధ్య జరిగింది . రెండు రాష్ట్రాల ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ టైం టు  టైం అప్డేట్ తో సాధ్యం చేసారు మనవాళ్ళు.


స్నేక్ గ్యాంగ్: పాత బస్తీలో వేటాడిన పోలీసులు

ఒంటరిగా వచ్చిన జంటల మీద అఘాయిత్యాలకు పాల్పడే స్నేక్ గ్యాంగ్ మీద పోలీసులు ఇప్పుడు ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. ఈ ఉదయం పహాడీ షరీఫ్ లో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 420 మంది పోలీసులు ఇందులో పాల్గొని జట్లు జట్లుగా విడిపోయి ఆ ప్రాంతం అంతా గాలించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మంది రౌడీషీటర్లు, 11 మంది అనుమానితులను, 30 బైక్ లు, 3 వ్యాన్ లు, 2 కార్లు, 2 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు స్నేక్ గ్యాంగ్ లో ఎ1 నిందితుడు ఫైసల్ దయానికి చెందిన స్కార్పియో, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో దయానీ సోదరులు, అతనికి సహకరించిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పహాడీ షరీఫ్ సమీపంలోని షహీన్ నగర్, ఎర్రగుంట తదితర ప్రాంతాలు పచ్చగా గుట్టలతో అహ్లాదకరంగా ఉంటాయి.  దీంతో సెలవురోజుల్లో, మిగతా సమయాలలో ప్రేమజంటలు, దంపతులు సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తుంటాయి. ఈ ప్రాంతంలోకి జంటలు అడుగుపెట్టగానే ఈ స్నేక్ గ్యాంగ్ కు సమాచారం చేరిపోతుందట. ఇక కోరలు పీకిన పాములు తీసుకుని గుర్రాల మీద, ద్విచక్ర వాహనాల మీద ఈ గ్యాంగ్ జంటలున్న ప్రాంతానికి బయలుదేరుతారు.
అక్కడ దొరికిన అమ్మాయిలను వివస్త్రలను చేసి, పాములతో బెదిరించి అత్యాచారం చేస్తారు. దీనినంతా వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించేవారు. ఎన్నో ఏళ్లుగా ఈ అకృత్యాలు జరుగుతున్నాయి. అయితే స్థానికంగా బలంగా ఉన్న పార్టీ అండతో పాటు, పోలీసు అధికారుల సహకారం కూడా ఈ స్నేక్ గ్యాంగ్ కు తోడవడంతో వారి గురించి తెలిసిన స్థానికులు కూడా భయంతో మిన్నకుండిపోయారని తెలుస్తోంది.

ఒక్క ఐడియా… ఒక్క వారం… ప్రపంచ అవార్డు

ఆలోచనలో పస ఉంటే నువ్వు గొప్పోడు కావడానికి ఒక్క క్షణం చాలంటారు. అది అక్షరాల నిజమని నిరూపితం అయ్యింది. ఒక మంచి ఆలోచన కొన్ని లక్షల మందికి మేలు చేసింది. ఆ ఆలోచన చేసిన మహిళకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అసలు విషయం ఏంటంటే.. కొంతకాలంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక వ్యాధిపై అవగాహన కోసం సెలబ్రటీలు పోటీలు పడి ఫ్రిజ్ వాటర్ నెత్తిమీద పోసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఎంత అన్నది పక్కన పెడితే దానివల్ల సెలబ్రిటీలు పొందుతున్న లాభమే ఎక్కువ. ఇది మంచిదే కాని మనకు పనికొచ్చేది కాదంటూ హైదరాబాదుకు చెందిన జర్నలిస్టు మంజులత కళానిధి దానిని స్ఫూర్తిగా తీసుకుని మనకు కావల్సింది ఐస్ బకెట్ కాదు, రైస్ బకెట్ అని పిలుపునిచ్చింది. అంతే… ఒక బకెట్ నీరు మీద పోసుకోవడం కంటే ఒక బకెట్ రైస్ ఎవరికైనా పేదవాళ్లకు దానం చేయండని ఆమె ఇచ్చిన పిలుపు గంటల్లో పాకిపోయింది. వారంలో అరవై వేల ఫేస్ బుక్ లైకులకు చేరింది. కొన్ని లక్షల మంది ఆమె ఆలోచనకు ప్రభావితమయ్యారు. పేదల కడుపు నింపిన ఆమె ఆలోచన ఐక్య రాజ్య సమితికి కూడా నచ్చింది. అంతర్జాతీయంగా “ఐకాంగో’ సేవా రంగంలో వారికిచ్చే కర్మవీర్ అవార్డు ఆమెకు దక్కింది. మంజులతకు వచ్చే ఏడాది మార్చిలో ఈ అవార్డును ఢిల్లీలో జరిగే వేడుకలో ప్రదానం చేస్తారు. మొత్తానికి ఒక మంచిపనికి ఇంత వేగంగా గుర్తింపు రావడం ముదావహం. ఆమె మన హైదరాబాదీ కావడం మనకు ఆనందం.

‘కనెక్టింగ్ ద సిటి అఫ్ నిజామ్స్’ పేరుతొ హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రోరైల్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యద్భుత కళాఖండాలు, భారీ నిర్మాణాల జాబితాలో హైదరాబాద్ మెట్రోకు స్థానం లభించింది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వారు ప్రసారం చేసే, మెగా కన్ స్ట్రక్షన్స్ ప్రొగ్రామ్ లో హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన నిర్మాణం తదితర అంశాల గురించి ప్రసారం కానున్నది. నేషనల్ జియోగ్రఫీ చానల్ లో ప్రసారం అవుతున్న తోలి మెట్రో ఛానల్ గా హైదరాబాద్ మెట్రో స్థానం సంపాదించింది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో కనెక్టింగ్ ద సిటి ఆఫ్ నిజామ్స్ పేరుతొ అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నది. మొత్తం మూడు ఎపిసోడ్స్ రూపంలో ఈ ప్రొగ్రామ్ ను నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ప్రసారం చేయనున్నది.

Tuesday, 2 September 2014

ఎస్‌బీహెచ్ కొత్త పథకం "వృద్ది 275 డేస్"

హైదరాబాద్: దేశీయ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మరో కొత్త డిపాజిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పేరు ఎస్‌బీహెచ్ "వృద్ది 275 డేస్". ఏడాది లోపు కాలం పాటు నగదు దాచుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుందని... అధిక వడ్డీ రేటుతో పాటు ఎప్పుడైనా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఈ పథకంలో ఉందని ఎస్‌బీహెచ్ తెలిపింది. 275 రోజుల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకం ఈరోజు (మంగళవారం, సెప్టెంబర్ 2) నుండి అక్టోబర్ 31 వరకూ నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్లపై ఎస్‌బీహెచ్ 9 శాతం వార్షిక వడ్డీ రేటు చెల్లిస్తుంది. కస్టమర్స్ కనీసంగా రూ. 10,000 గరిష్టంగా రూ. 99,99,000 డిపాజిట్ చేయెుచ్చు. ఈ డిపాజిట్‌‌పై రుణం, ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాలు కూడా ఉంటాయని ఎస్‌బీహెచ్ తెలిపింది. ఈ డిపాజిట్ పథకం వల్ల వినియోగదారులకు చాలా ప్రయోజనాలున్నాయి. ఎటువంటి పెనాల్టీ చెల్లించకుండా 7 రోజుల వ్యవధిలో మీ డబ్బుని తిరిగి తీసుకోవచ్చు.