Wednesday 3 September 2014

స్నేక్ గ్యాంగ్: పాత బస్తీలో వేటాడిన పోలీసులు

ఒంటరిగా వచ్చిన జంటల మీద అఘాయిత్యాలకు పాల్పడే స్నేక్ గ్యాంగ్ మీద పోలీసులు ఇప్పుడు ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. ఈ ఉదయం పహాడీ షరీఫ్ లో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 420 మంది పోలీసులు ఇందులో పాల్గొని జట్లు జట్లుగా విడిపోయి ఆ ప్రాంతం అంతా గాలించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మంది రౌడీషీటర్లు, 11 మంది అనుమానితులను, 30 బైక్ లు, 3 వ్యాన్ లు, 2 కార్లు, 2 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు స్నేక్ గ్యాంగ్ లో ఎ1 నిందితుడు ఫైసల్ దయానికి చెందిన స్కార్పియో, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో దయానీ సోదరులు, అతనికి సహకరించిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పహాడీ షరీఫ్ సమీపంలోని షహీన్ నగర్, ఎర్రగుంట తదితర ప్రాంతాలు పచ్చగా గుట్టలతో అహ్లాదకరంగా ఉంటాయి.  దీంతో సెలవురోజుల్లో, మిగతా సమయాలలో ప్రేమజంటలు, దంపతులు సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తుంటాయి. ఈ ప్రాంతంలోకి జంటలు అడుగుపెట్టగానే ఈ స్నేక్ గ్యాంగ్ కు సమాచారం చేరిపోతుందట. ఇక కోరలు పీకిన పాములు తీసుకుని గుర్రాల మీద, ద్విచక్ర వాహనాల మీద ఈ గ్యాంగ్ జంటలున్న ప్రాంతానికి బయలుదేరుతారు.
అక్కడ దొరికిన అమ్మాయిలను వివస్త్రలను చేసి, పాములతో బెదిరించి అత్యాచారం చేస్తారు. దీనినంతా వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించేవారు. ఎన్నో ఏళ్లుగా ఈ అకృత్యాలు జరుగుతున్నాయి. అయితే స్థానికంగా బలంగా ఉన్న పార్టీ అండతో పాటు, పోలీసు అధికారుల సహకారం కూడా ఈ స్నేక్ గ్యాంగ్ కు తోడవడంతో వారి గురించి తెలిసిన స్థానికులు కూడా భయంతో మిన్నకుండిపోయారని తెలుస్తోంది.

0 comments:

Post a Comment