Thursday, 16 October 2014

వైవిధ్యమైన కథతో నాగార్జున

నాగార్జున మనం విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వున్న ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈసారి మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులముందుకురాబోతున్నారు. ఇకముందు కథలో కొత్తదనముంటే తప్ప సినిమాలు చేయను. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరంగా వుందామని నిర్ణయించుకున్నాను అని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు నాగార్జున.

అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయన కథానాయకుడిగా సోగ్గాడే చిన్నినాయనే అనే పేరుతో త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆస్తిపరులు చిత్రంలోని సోగ్గాడే చిన్నినాయనే ఒక్కపిట్టనైనా కొట్టలేదు సోగ్గాడే పాటలోని పల్లవిని తాజా చిత్రానికి టైటిల్‌గా ఎంపికచేసుకోవడం విశేషం. ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిర్మాత రామ్మోహన్‌రావుతో కలిసి అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున తాత, మనవడి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, ఆద్యంత వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఆయన పాత్ర చిత్రణ మునుపెన్నడూలేని రీతిలో వుంటుందని చెబుతున్నారు. తాత పాత్రకు జోడీగా రమ్యకృష్ణను ఎంపిచేశారు. మనవడి పాత్రకు జోడీగా ఓ యువకథానాయిక నటించనున్నట్లు తెలిసింది. సునిశితమైన హాస్యం, వ్యంగం మేళవింపులతో సరికొత్త పంథాలో సాగే కథాంశమిదని, నాగ్ కెరీర్‌లో మరో విలక్షణ చిత్రంగా నిలుస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.

0 comments:

Post a Comment