Friday 26 September 2014

ఐ ఆడియో వేడుకకు సిల్వస్టర్ స్టాలోన్?

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న ఐ చిత్రం పలు సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. హాలీవుడ్ చిత్రాల్ని తలదన్నే రీతిలో ప్రచార చిత్రాలున్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. దీపావళికి ప్రేక్షకులముందుకురానున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివిధ భాషా హక్కులు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నట్లు సినీ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ తీసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం 33కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ చిత్ర హక్కుల్ని మెగా సూపర్‌గుడ్ సంస్థ దక్కించుకున్నదని అంటున్నారు. చెన్నైలో జరిగిన ఆడియో వేడుకకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్వాజ్జ్‌నెగ్గర్‌ను అతిథిగా తీసుకువచ్చిన చిత్ర బృందం త్వరలో హైదరాబాద్‌లో జరుగబోవు తెలుగు గీతావిష్కరణకు మరో హాలీవుడ్ సూపర్‌స్టార్‌ను రప్పించే ప్రయత్నాల్లో వున్నట్లు తెలిసింది. సిల్వస్టర్ స్టాలోన్, జాకీఛాన్ హైదరాబాద్ ఆడియో వేడుకకు రావొచ్చని ప్రచారం జరుగుతోంది.

0 comments:

Post a Comment