Wednesday 24 June 2015

బాహుబలి సెన్సార్ పూర్తి జూలై 10న ప్రేక్షకుల ముందుకు

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. అర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు సమర్పకుడు. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికేట్ లభించింది. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. తమిళ ఆడియోను ఈ నెల 24న, మలయాళ ఆడియోను 27న విడుదల చేయబోతున్నాం. చిత్ర కథ, కథనాలు, ప్రభాస్ నటన, పాత్రచిత్రణ, గ్రాఫిక్స్ హంగులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు. రమ్యకృష్ణ, సుదీప్, సత్యరాజ్, నాజర్, అడివి శేష్, ప్రభాకర్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్‌కుమార్, ఆర్ట్: సాబుశిరిల్, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.

Saturday 24 January 2015

త్రిపురగా భయపెడుతున్న కలర్స్ స్వాతి..

అంజలి ప్రధాన పాత్రలో గత సంవత్సరం వచ్చిన గీతాంజలి మూవీ చిన్న చిత్రాల్లో పెద్ద హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ సినిమాకు హైలెట్ అయ్యింది. అంజలి తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది. ఇప్పుడు గీతాంజలి డైరెక్టర్ రాజ్‌కిరణ్ ఆ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసేందుకు దర్శకనిర్మాతలు కలర్స్ స్వాతిని సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు త్రిపుర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. గీతాంజలిగా అంజలి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెడితే ఇప్పుడు కలర్స్ స్వాతి త్రిపురగా ఎలా భయపెట్టిస్తుందో చూడాలి.

సమీక్ష : పటాస్ రివ్యూ

సమీక్ష : పటాస్ రివ్యూ

 

తెలుగు పోస్టర్. కామ్ రేటింగ్ : 3.5/5
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ సినిమా నేడు విడుదలైంది. శృతి సోది హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారంటే ప్రయోగాల కంటే కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తారు. అయితే కమర్షియల్ సినిమా తీసి హిట్ట కొట్టడం అంత ఈజీ కాదు. మరి అనిల్ రావి పూడి పటాస్ లాంటి ఫక్తు కమర్షియల్ సినిమాతో సక్సెస్ కొట్టాడా. చాన్నాళ్ల నుంచి హిట్టు కోసం తపిస్తున్నా కళ్యాణ్ రామ్ కోరిక తీరిందా లేదా అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎప్పుడూ లేని రీతిలో ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందో..? లేదో..? ఓ సారి చూడండి.
 కథ :

కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) అవినీతిపరుడైన పోలీస్ అధికారి. తనను తాను కావాలని హైదరాబాద్ కు బదిలీ చేయించుకుంటాడు. ఒకసారి అతను హైదరాబాద్ చేరగానే.. తన అధికారాలు ఉపయోగించి తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో, అతను హైదరాబాద్ డిజిపి (సాయి కుమార్)కు తలనొప్పిగా మారిన స్థానిక రాజకీయ నాయకుడు (అశుతోష్ రాణా)ను ప్రోత్సహిస్తాడు.
కళ్యాణ్ సిన్హా హైదరాబాద్ రాక వెనుక ఒక నిజం ఉందని తెలుసుకున్న హైదరాబాద్ డిజిపి షాక్ కి గురవుతాడు. ఇదే కథలోని అసలైన ట్విస్ట్. ఆ నిజం ఏమిటి..? కళ్యాణ్ సిన్హా ఎందుకు అవినీతి అధికారిగా మారాడు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే.. మీరు వెండితెరపై కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాను చూడాలి.

దర్శకుడు అనిల్ రావిపూడి పటాస్ కథ పట్టుకొని చాన్నాళ్లు వెయిట్ చేసి మరీ అటెంప్ట్ చేశాడు. పెద్ద హీరోలు చేసే దమ్మున్న కథ అయినా...కళ్యాణ్ రామ్ మాత్రమే చేయాలని ఏరి కోరి ఒప్పించుకున్నాడు. కళ్యాణ్ సైతం అనిల్ మీద నమ్మకం పెట్టాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు అనిల్. కళ్యాణ్ ను కొత్తగా చూపించాడు అనే కంటే... పవర్ ఫుల్ గా చూపించాడు. కళ్యాణ్ రామ్ లో ఎంత ఎనర్జీ ఉందో నిరూపించాడు. కళ్యాణ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ చెప్పించిన విధానం బాగుంది. కథకు సరైన స్క్రీన్ ప్లే కుదరడంతో...ఎక్కడా సినిమా గ్రాఫ్ డ్రాప్ కాలేదు. కథకు తగ్గ కామెడీ కుదరడంతో... ఆడియెన్స్ కి ఎక్కడా బోర్ కొట్టలేదు. శ్రీనివాస్ రెడ్డి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ప్రభాస్ శ్రీను, పోసాని, షకలక శంకర్, జెపి కామెడీ పండించారు. పార్థాయ కామెడీ బాగా కుదిరింది. ఎం.ఎస్.నారాయణ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సునామీ సుభాష్ గా నవ్వుల్లో ముంచెత్తాడు. ముఖ్యంగా మదర్స్ యాక్షన్ ఫోర్స్ సెకాండాఫ్ కు బాగా ప్లస్ అయ్యింది. డైరెక్టర్ అనిల్ డైలాగ్స్ సైతం బాగా రాసుకున్నాడు. కళ్యాణ్ రామ్, సిస్టర్, సాయి కుమార్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. కథకు తగ్గ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. కథకు తగ్గ పాటలు కుదిరాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కొట్టాడు. హీరోను ఢీకొట్టే విధంగా అశుతోష్ రానా పెర్ ఫార్మెన్స్ ట్టుఉంది. ఓవరాల్ గా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్ కోసం అరెవో సాంబ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్.  హీరోయిన్ శృతీ బాగానే ఉంది. కమర్షియల్ సినిమాలకు బానే వర్కవుట్ అవుతుంది. 

కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘పటాస్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవర్ ఫుల్ హీరో క్యారేక్టరైజెషన్ మరియు స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులను ఆలరించే ఎంటర్టైన్మెంట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ముందు రొటీన్ కథను పెద్దగా పరిగణలోకి తీసుకోనవసరం లేదు. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాను తప్పకుండా చూడండి.

రివ్యూ: బీరువా సమీక్ష

రివ్యూ: బీరువా సమీక్ష


తెలుగు పోస్టర్. కామ్ రేటింగ్ : 2.5/5
 'ఉషాకిరణ్ ఫిల్మ్స్, అలాగే 'జెమినీ' టీవీ కీలక బాధ్యులకు చెందిన 'ఆనంది ఆర్ట్స్' - రెండూ కలసి సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా కాబట్టి, 'బీరువా' చిత్రంపై ఆసక్తి నెలకొంది. దానికి తోడు టీవీ చానల్స్‌లో వచ్చిన 'బీరువా' ట్రైలర్లు మరింత ఉత్సుకత పెంచాయి. మరి ఇంతకీ హాలులోకొచ్చిన 'బీరువా' లో ఏమున్నట్లు?

 బీరువా స్టోరీ:

 ఒక ఇంట్లో కొన్న బీరువాలో ఒక వ్యక్తి బయటకొస్తాడు. బీరువాలో మనిషి ఉండడమని ఆశ్చర్యపోతుండే సరికి, బీరువాలో నుంచి ఊడిపడ్డ సదరు హీరో గారు తన ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు. అనగనగా ఒకబ్బాయి. పేరు సంజు (సందీప్ కిషన్). ఇంట్లో అమ్మా నాన్న (అనితా చౌదరి, నరేశ్)ల మాట వినకుండా గాలికి తిరిగే రకం. అతను చేసే ప్రతి పనితో వాళ్ళ నాన్నకు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంటుంది. సదరు తండ్రి సూర్యనారాయణ (నరేశ్)ని ఒకడు నమ్మించి, ఒకడు మోసం చేస్తాడు.

ఆ రూ. 40 కోట్లు తిరిగి పొందడానికి విజయవాడలోని బడా రౌడీ కమ్ రాజకీయవాది ఆదికేశవులు నాయుడు (ముఖేశ్‌రుషి)ని ఆశ్రయిస్తాడు - తండ్రి. తీరా ఆ ఆదికేశవులు కూతురు స్వాతి(సురభి)నే హీరో ప్రేమిస్తుంటాడు. మొదట్లో హీరోను హీరోయిన్ దూరం పెట్టినా, ఆ 40 కోట్ల వ్యవహారం ఆదికేశవులు సెటిల్ చేసే సమయానికి, వాళ్ళ ప్రేమ పిందె పండవుతుంది. హీరో, హీరోయిన్లిద్దరూ కలసి పరారవుతారు. కొడుకు తెచ్చిన కొత్త సమస్యతో తండ్రికి షాక్‌కు గురవుతాడు. అక్కడికి ఫస్టాఫ్ అయిపోతుంది.

ఇక, సెకండాఫ్ అంతా - ఆదికేశవులు బారి నుంచి తప్పించుకోవడానికి హీరో హీరోయిన్లు పడే కష్టాలు, హీరో తెలివిగా వ్యవహరించి, హీరోయిన్‌ను కాపాడడం. చివరకు హీరోయిన్ తండ్రి తన తప్పు తెలుసుకొని, 'అమ్మాయికి కావాల్సింది శాసించే రూలర్ కాదు, ప్రేమించే ఫాదర్' అని గ్రహించి, వారిద్దరికీ పెళ్ళి చేస్తాడు.

బీరువా నటీనటుల పెర్పామెన్స్:
నటీనటుల్లో సంజూ పాత్రను సందీప్‌కిషన్ ఈజీగా చేశాడు. అయితే తన గత చిత్రాలకు ఈ చిత్రంతో కంపారిజన్ చేస్తే పెద్ద మార్పు లేదు. ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఒకే స్టైల్లో ఉంది.  హీరోయిన్ సురభి అందంగా కనిపించింది. సందీప్ సరసన బొద్దుగా ఉన్నట్టు అనిపించింది. సీనియర్ నరేష్ తండ్రి పాత్రలో చక్కగా నటిస్తే సందీప్‌కు తల్లిగా చేసిన అనితాచౌదరి అక్కలా ఉంది. ముఖేష్‌రుషి, అజయ్, చలపతిరావు తమ పాత్రలకు తగినట్టు నటించారు. 

చండశాసనుడైన హీరోయిన్ తండ్రిని ఎదిరించి, హీరోయిన్‌ను హీరో ప్రేమించడం... వారిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరగడం... చివరకు తండ్రికి అతని తప్పు తెలిసేలా చేసి, హీరో హీరోయిన్లు ఏకం కావడం - ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. అయితే, ఆ కథలో కీలకమైన మరో పాత్రధారిగా బీరువాను పెట్టుకొని, తద్వారా కథ నడపడమనేది కొత్తే! కాకపోతే, ఇలాంటి వాటికి కథ కన్నా కథనం బలంగా ఉండాలి. టైటిల్‌కు న్యాయం చేసేందుకు పలుసార్లు దర్శకుడు బీరువాలను చూపిస్తూ సినిమా మొత్తం కొన్ని వందల బీరువాలను వాడుకున్నాడు. సెకండాప్ స్టార్ట్ అయ్యాక 30 నిమిషాల్లో ముగించాల్సిన సినిమాను సాగదీసి సప్తగిరి పాత్ర తెచ్చాడు. హీరో విలన్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల బీరువాడు వాడుకోవడం కాస్త కొత్తగా ఉంటుంది. 

మహేశ్‌కి తల్లిగా సుకన్య ...!

‘పెద్దరికం’ కథానాయిక సుకన్య గుర్తుండే ఉంటారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు కారెక్టర్‌గా నటిగా చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘అధినాయకుడు’లో కూడా ఓ కీలక పాత్ర చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు తల్లిగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ముందు ‘లగాన్’ ఫేం గ్రేసీ సింగ్‌ను ఈ పాత్రకు తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ఫైనల్‌గా సుకన్యను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో ఆమె జగపతిబాబుకి భార్యగా నటిస్తున్నారు. ‘పెద్దరికం’లో అలరించిన ఈ జంట దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టిన చిత్రం ఇది. ఇందులో మహేశ్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు.
 

ప్రయోగాత్మక పాత్రలకే ప్రాధాన్యం!


ఇటీవలే విడుదలైన బేబీ చిత్రంతో కెరీర్‌లో తొలి భారీ కమర్షియల్ విజయాన్ని దక్కించుకుంది ఈ సుందరి.

ఈ సక్సెస్ తాలూకూ ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తోంది తాప్సీ. ఆమె మాట్లాడుతూ బేబీ చిత్రం నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. గతంలో తెలుగులో చాలా వరకు గ్లామర్ పాత్రల్లోనే నటించాను. బాలీవుడ్‌లో చేసిన తొలి చిత్రం చశ్మే బద్దూర్‌లో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించాను. దాంతో కెరీర్ ఆసాంతం మూసధోరణి పాత్రలకే పరిమితమైపోవాల్సి వస్తుందనుకున్నాను. గ్లామర్ తార అనే ముద్ర నాపై ఎక్కడ పడుతుందో అని చాలా భయపడ్డాను.

అలాంటి సమయంలోనే బేబీ చిత్రం నాకు నూతనోత్సాహాన్ని అందించింది. ఈ సినిమాతో నా ఆలోచనా ధృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇందులో పోరాట ఘట్టాల కోసం చాలా శ్రమించాల్సివచ్చింది. కొన్నిసార్లు గాయాలపాలైయ్యాను. కానీ ఇప్పడు నా పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే అనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని చిత్రమిది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలకే ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నాను. అని చెప్పింది.

మల్టీస్టారర్ చిత్రాలు చేయమని అడుగుతున్నారు



డా.రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం గడ్డంగ్యాంగ్. జీవితారాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది.


ఈ సందర్భంగా డా.రాజశేఖర్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఆయన మరిన్ని విశేషాలు తెలియజేస్తూ తమిళ మాతృకలోని ఫీల్‌ను చెడగొట్టకుండా తెలుగులో రీమేక్ చేశాం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. జర్నీ ఫేమ్ శరవణన్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురేష్ పీటర్ జయకుమార్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అచ్చు అందించిన నేపథ్య సంగీతం, విమల్ రాంబో ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుంది. ఈ చిత్రం తరువాత రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించిన పట్టపగలు విడుదలవుతుంది. ఆ తరువాత అర్జున చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఈ మూడు సినిమాలే కాకుండా ఈ ఏడాది మొత్తం నాకు సంబంధించిన ఏడు చిత్రాలు విడుదల కానున్నాయి. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలు చేయమని అడుగుతున్నారు. నేను చేయదగ్గ పాత్ర ఏదైనా వస్తే నటించడానికి నేను సిద్ధమే. హీరో పాత్రలే చేస్తాను. మరే ఇతర పాత్రలు చేయను అన్న నియమ నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు. గడ్డం గ్యాంగ్ విడుదల తరువాత మల్టీస్టారర్ చిత్రాలు చేయాలనుకుంటున్నాను అన్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు గడ్డంగ్యాంగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని జీవిత తెలిపింది.

మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రుద్రమదేవి



కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి వీరగాథను వెండితెర చిత్ర రూపం చేస్తూ స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తోంది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరీయో స్కోపిక్ 3డీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ల క్రితం వసంతపంచమి పర్వదినాన వరంగల్‌లోని వేయిస్థంబాల దేవాలయంలో చిత్రాన్ని ప్రారంభించాం. రెండేళ్ల పాటు మహాయజ్ఞంలా సాగిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

డబ్బింగ్, గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని వేసవి ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాను అన్నారు. రానా, సుమన్, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, ప్రభ, కేథరిన్, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ప్రసాదాదిత్య, అజయ్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, కెమెరా: అజయ్‌విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. రామ్‌గోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.