Thursday 18 September 2014

పవర్‌ఫుల్ విజయమిది!

రవితేజతో సినిమా చేయాలన్న నా నాలుగేళ్ల కల పవర్ చిత్రంతో ఫలించింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. సక్సెస్‌ఫుల్ చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా వుంది అన్నారు రాక్‌లైన్ వెంకటేష్. రవితేజ కథానాయకుడిగా ఆయన నిర్మించిన చిత్రం పవర్. కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకుడు. హన్సిక కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రవితేజ మాట్లాడుతూ కథలో కొత్తదనం, యాక్షన్, వినోదాల చక్కటి మేళవింపు సినిమా విజయానికి కారణాలయ్యాయి. తొలి చిత్రంతోనే దర్శకుడిగా బాబి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తమన్ సంగీత దర్శకత్వం వహించిన నా చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. పవర్ చిత్రం మరోసారి ఆ సెంటిమెంట్‌ను నిజం చేసింది. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు తెలుగులో ఈ చిత్రం పవర్‌ఫుల్ విజయాన్నందించింది అన్నారు. రవితేజ, నేను ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తులం. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో రవి ఎప్పుడూ ముందుంటాడు. కథ వినగానే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే భావన కలిగింది అని ప్రకాష్‌రాజ్ చెప్పారు. సినిమాలో నోటంకి... పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోందని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ఈ సినిమా ద్వారా బాబి రూపంలో పరిశ్రమకు మంచి దర్శకుడు లభించాడని కోన వెంకట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి, ఉత్తేజ్, సప్తగిరి, భాస్కరభట్ల, రామ్‌లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment