Sunday 14 September 2014

టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమే: పురందేశ్వరి

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తాజాగా హస్తానికి చేయిచ్చి, కమలం చేతబట్టిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి  చూపు తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీపై పడినట్లు సమాచారం. టీడీపీలోకి వచ్చేందుకు తాము  కూడా సానుకూలంగానే ఉన్నామని,  అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని దగ్గుబాటి దంపతులు చెప్పటం విశేషం. ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ సమావేశంలో వారు ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని మరీ... కాషాయ కండువా కప్పుకున్న  ఆమె అక్కడ గౌరవం ఉంటుందని ఆశించారు. దాంతో తాను ఆశించిన చోట టికెట్టు కూడా దక్కుతుందని భావించారు. అయితే ఆమె అంచనాలు తల్లకిందులయ్యాయి.

రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి.  పొత్తుల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట లోక్సభ బరిలోకి దిగి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె పార్టీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు.  ఇప్పటికే నందమూరి, నారావారి కుటుంబంలో రాజకీయ పోరు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం  అమెరికా పర్యటనలో ఉన్న చిన్నమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

0 comments:

Post a Comment