Wednesday 17 September 2014

'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం

  • మెట్రో రైల్వేపై వచ్చిన కథనాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
  •   ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నమని మండిపాటు
  •   సీఎంను కలిసి వివరణ ఇచ్చిన ‘మెట్రో’ ఎండీ, ఎల్‌అండ్‌టీ సంస్థ ఎండీ
  •   రెండో దశపై చర్చ కోసం ఢిల్లీకి సీఎస్, ప్రభుత్వ సలహాదారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై ఎల్‌అండ్‌టీ సంస్థ చేతులెత్తేసిందంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమని.. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే యత్నమని ఆయన మండిపడ్డారు. బుధవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, ‘ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్’ ఎండీ వీబీ గాడ్గిల్, మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, సలహాదారు పాపారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ‘మెట్రో’పై పత్రికల్లో వచ్చిన కథనాలు చర్చకు రాగా... అవి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం సాధారణ ప్రక్రియని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తాజాగా ఎల్‌అండ్‌టీ రాసిన లేఖలోని కొన్ని అంశాలను మాత్రమే పేర్కొంటూ ప్రాజెక్టుపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా పలు పత్రికల్లో కథనాలు రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టును కావాలనే తప్పుడు కోణంలో చూపించే యత్నం జరిగిందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలుకు సంబంధించిన సమస్యలు ఈ సమీక్షా సమావేశంలో పరిష్కారం అయ్యాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే మెట్రోరైలుకు సంబంధించి వచ్చిన కథనాలపై ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఉదయమే సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీకి వివరణ ఇచ్చారు. సీఎం సచివాలయానికి వచ్చాక ఆయనను కూడా కలిసి విషయం వివరించారు. ఇదే సమయంలో ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్ సైతం సచివాలయానికి చేరుకుని సీఎస్‌తో సమావేశమయ్యారు. అనంతరం సీఎంతో కొద్దిసేపు భేటీ అయ్యారు.
 
 రెండో దశ కోసం ఢిల్లీకి సీఎస్..
 మెట్రో రైలు రెండో దశ పై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే మెట్రోరైలు నిపుణుడు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకుంటారని చెప్పారు.
 

0 comments:

Post a Comment