Tuesday 16 September 2014

ఆయనతో సినిమా చేయడం కత్తిమీద సాములాంటిది...

రామ్‌చరణ్ వున్నాడు కాబట్టి నేను సినీ పరిశ్రమకు దూరమయ్యానని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నేను చరణ్‌లో చూసుకుంటున్నాను. నా ఊహలకు మించి నటుడిగా చరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో నా 150వ చిత్రం ప్రారంభంకావొచ్చేమో. కథ మీదనే ఆ సినిమా ఆధారపడి వుంటుంది అన్నారు చిరంజీవి. ఆయన తనయుడు రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గోవిందుడు అందరివాడేలే. కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. యువన్‌శంకర్‌రాజా స్వరపరచిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో విడుదలయ్యాయి.

చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి ప్రతిని రాఘవేంద్రరావు స్వీకరించారు. ప్రచార చిత్రాల్ని చిరంజీవి సతీమణి సురేఖ, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నాకు కృష్ణవంశీ అంటే ప్రత్యేకమైన అభిమానం. కుటుంబ విలువలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ ఆయన సినిమాలు తీస్తారు. ఆయన చిత్రాల్లోని ప్రతి దృశ్యం సంక్రాంతి, దసరా పండుగను తలపిస్తుంది. కృష్ణవంశీతో సినిమా చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో సినిమా చేయడం కత్తిమీద సాములాంటిది.

ఇంత ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఆయన పెట్టే పరీక్షలు అవసరమా? అన్న భావన కలిగేది. అందుకే ఆయన సినిమాల్లో నటించే ధైర్యం ఎప్పుడూ చేయలేదు అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ మా నాన్న నాకు నేర్పించింది, పాటించేది ఒకటే..మన ఇల్లు మనమే చక్కబెట్టుకోవాలి. మన పని మనమే చేసుకోవాలి. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి అనే తొలి డైలాగ్ ఈ సినిమా సారాంశామేమిటో చెబుతుంది. అందరూ కలిసివుండాలన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ అన్నారు. రామ్‌చరణ్‌తో తనకిది నాలుగో చిత్రమని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా వుంటుందని కథానాయిక కాజల్‌అగర్వాల్ తెలిపింది. సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా మాట్లాడుతూ చరిత్ర పునరావృతమౌతోంది. మా నాన్న చిరంజీవిగారితో పనిచేశారు. ఇప్పుడు నేను ఆయన తనయుడితో పనిచేస్తున్నాను. నేను ఎక్కువగా మాట్లాడను. నా సంగీతమే మాట్లాడుతుంది అన్నారు.

0 comments:

Post a Comment