Tuesday 7 October 2014

‘శివ’ ఒక్కటి చాలు... గర్వపడడానికి : నాగార్జున

‘‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. ఎప్పుడూ బాధ పడలేదు. కానీ ఒక్క ‘శివ’ సినిమా తీశాను. అందుకు గర్విస్తాను. నా సినీ జీవితాన్నే కాక, వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చేసిన సినిమా అది. వేలాది తారల మధ్య భూప్రపంచం ఉందంటారు. ఆ నక్షతాల నుంచి ఊడిపడి, నాకు  ‘శివ’నిచ్చిన నక్షత్రం రామ్‌గోపాల్‌వర్మ. ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు నాకు ఎన్నో. షూటింగ్ బ్రేక్‌లో కెమెరామేన్ రసూల్ ఎల్లోర్‌తో క్రికెట్ ఆడేవాణ్ణి. వీలు దొరికితే... అమలతో సరసాలు కూడా ఆడేవాణ్ణి’’ అంటూ ‘శివ’ స్మృతుల్ని నెమరువేసుకున్నారు నాగార్జున. ‘శివ’ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ మంగళవారం హైదరాబాద్‌లో ఆ చిత్రం బృందం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

 ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ -‘‘ ‘శివ’ సినిమాతో నేను రూల్స్ బ్రేక్ చేశానని చాలామంది అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే... ఆ సినిమా నాటికి అసలు నాకు రూల్స్ అనేవే తెలీదు. ఓ విధంగా ఆ సినిమా ట్రెండ్ సృష్టించడానికి కారణం అదే. ఇప్పటికీ, ఎప్పటికీ నేను చెప్పేది ఒక్కటే... ‘శివ’ నాగార్జున వల్లే సాధ్యమైంది. సినిమా తీస్తున్నప్పుడు ఒక కొత్త ప్రయత్నం అనుకున్నాం కానీ, ట్రెండ్ సెట్టర్ అని మాత్రం ఊహించలేదు. అద్భుతాలనేవి ఎప్పుడూ సృష్టించబడవు. సంభవిస్తాయి. అలా సంభవించిందే ‘శివ’. అనుకోకుండా పై నుంచి  ఊడిపడ్డ సినిమా అది’’ అన్నారు. ‘శివ’ తనకొక అందమైన జ్ఞాపకమని, ప్రతి ఒక్కరూ ఇష్టంతో పనిచేయడం వల్లే ‘శివ’ ఓ చరిత్ర అయ్యిందనీ అమల గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.గోపాల్‌రెడ్డి, కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, జేడీ చక్రవర్తి, కోట శ్రీనివాసరావు, తనికెళ భరణి, చిన్నా, ఉత్తేజ్, రసూల్ ఎల్లోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే సిరాశ్రీ రూపొందించిన ‘పాతికేళ్ల  శివ’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

0 comments:

Post a Comment