Saturday 3 January 2015

2015 లో అంతా భారీ సినిమాల సందడి

2015లో స్టార్‌ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ కొత్త సంవత్సరంలో స్టార్‌ హీరోల వారసులు నటిస్తున్న సినిమాలు కూడా రిలీజ్‌లకు రానున్నాయి. కొత్త సంవత్సరంలో రిలీజవుతున్న తొలి తెలుగు స్ట్రెయిట్‌ భారీ సినిమా గోపాల గోపాల. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్రల్లో నటించారు. జనవరి 14న రిలీజ్‌ ఖరారు చేశారు. అంతకంటే ముందే శంకర్‌, విక్రమ్‌ కలయికలో వస్తున్న
"ఐ" చిత్రం  కన్నుల పండుగ  చేయబోతోంది. పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి గబ్బర్‌సింగ్‌ 2 ని తెరకెక్కిస్తున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రథమార్థంలోనే రిలీజవుతుందని సమాచారం.

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీమంతుడు వేసవిలో బరిలోకి వస్తుంది. ఇదే ఏడాది జనవరి చివరిలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్‌, కళ్యాణ్‌రామ్‌ పటాస్‌ రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా మొదలై, ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌కి సన్నద్దం చేయనున్నారు. బన్నిత్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాని వేసవి సెలవుల నాటికి సిద్ధం చేస్తారని సమాచారం. రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా త్వరలో మొదలవుతోంది. 2015 రిలీజుల్లో ఇదో భారీ బడ్జెట్‌ సినిమా. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సత్యదేవ్‌ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న భారీ చిత్రం కొత్త సంవత్సరం ప్రథమార్థంలోనే రిలీజ్‌ కానుంది.ఈ చిత్రానికి వారియర్‌, లయన్‌ టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయి. అలాగే నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోగ్గాడే చిన్నినాయనా వేసవి సెలవుల్లోనే రిలీజవుతుంది. అక్కినేని నటవారసుడు అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 2015 ప్రథమార్థం చివరిలో రిలీజవుతుంది. ఈలోగానే నాగచైతన్య హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోచెయ్‌ రిలీజవుతుంది.

2015లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాలివే:

2015లో ఎన్ని భారీ సినిమాలు రిలీజైనా ఓ రెండు సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగాల్సిందే. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి పార్ట్‌ 1 కొత్త సంవత్సరంలో వేసవి సెలవులకు రిలీజవుతోంది. ఈ సంగతిని ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా లాంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తున్న రుద్రమదేవి 3డి చిత్రాన్ని గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్టీరియోస్కోపిక్‌ 3డి విధానంలో తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌ ఓం 3డి తర్వాత తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మోక 3డి చిత్రమిదే. ఈ సినిమాని జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. ఇవి రెండూ రొటీన్‌ మూస సినిమాలకు దూరంగా తెరకెక్కుతున్న చిత్రాలు. పైగా భారీ బడ్జెట్‌లతో తెరకెక్కుతున్నాయి. యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న చిత్రాలు. అందుకనే ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలింమేకర్స్‌ కళ్లు ఈ సినిమాల వివరాల కోసం గూగుల్‌లో వెతుకుతున్నాయి.

0 comments:

Post a Comment