Saturday, 20 September 2014

రాజమౌళిని పొట్టోడా అని పిలిచే గట్స్ ఎవరికైనా ఉన్నాయా?... అవును ఉన్నాయట...

ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పొట్టోడా అని పిలిచే గట్స్ ఎవరికైనా ఉన్నాయా?... అవును  ఉన్నాయట... అయితే అది ఒకప్పుటి మాట. ఇప్పుడు మాత్రం మౌళి గారూ అంటూ గౌరవంగా పిలుస్తాడు. ఈ విషయాన్ని  రాజమౌళే స్వయంగా 'దిక్కులు చూడకు రామయ్య' ఆడియో వేడుకలో చెప్పారు.  ఆ చిత్ర దర్శకుడు త్రికోటి గురించి రాజమౌళి డిటైల్డ్ గా వివరించారు. దర్శకుడు క్రాంతికుమార్ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడినని, అక్కడ కోటి తనకన్నాసీనియర్‌ అని చెప్పారు. కోటి సినిమా పిచ్చోడని... సాధారణంగా కాస్త ఎక్కువ సినిమాలు చూసేవాడినే సినిమా పిచ్చోడు అంటాం గానీ, కోటి లాంటి సినిమా పిచ్చోడిని తన జీవితంలో చూడలేదని చెప్పారు.

చేతిలో డబ్బులున్నా లేకపోయినా... తినడానికి తిండి లేకున్నా కోటి సినిమా చూడాల్సిందే. పది రూపాయలు చేతిలో ఉంటే మనం ఆకలిగా ఉంటే ఏదైనా తింటామని, అయితే కోటి మాత్రం  ఎంత దూరమైనా నడిచి వెళ్లి ప్రతిరోజూ సెకండ్ షో చూస్తాడన్నారు. హైదారాబాద్ లో  షూటింగ్ అయిపోయిన తర్వాత... అమీర్ పేటలోని శేష్ మహల్ థియేటర్ లో పాత సినిమాలకు ఇద్దరం వెళ్లేవాళ్లమని చెప్పారు. సినిమా చూసి తిరిగి  వస్తూ ఒరే పొట్టోడా ఆ సినిమాలో.... ఆ సీను... అనేవాడని... తాను హైట్ గా ఉన్నా పొట్టోడా అని ఎందుకు పిలుస్తున్నారని అడిగితే... పొట్టోడా అంటే చిన్నోడురా... అని కోటి చెప్పారట.

తనకు సీనియర్ గా ఉన్నప్పుడు  ఏరా, ఒరే, పొట్టోడా అని పిలిచినా, తన దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసేందుకు వస్తానన్నప్పుడు... ఏ మౌళీ... ఏ మౌళీ అని పిలిచేవాడని... సీన్ కట్ చేస్తే  ఇప్పుడు సార్ అని పిలుస్తున్నాడని రాజమౌళి చెప్పాడు. కోటి సీనియర్, తాను జూనియర్ ని అంటూ జక్కన్న తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పారు. త్రికోటికి ఐదుసార్లు దర్శకుడిగా చేసే అవకాశం వచ్చి చివరి నిమిషంలో చేజారిపోయినా నిరుత్సాహపడలేదని.... ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నాడని రాజమౌళి తెలిపారు. కోటి పెద్ద దర్శకుడు కావాలని, దిక్కులు చూడకు రామయ్యా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

0 comments:

Post a Comment